
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, కార్యకర్తలను ఎవరూ అడ్డుకోవద్దని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రకటించింది.
ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతాయని స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే వాటి ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉంటుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో స్థానాల పంపకాలు ఉండవని వెల్లడించింది.
పార్టీ నాయకులు ఎవరూ పోటీ చేయాలనుకునే జనసేన కార్యకర్తలను అడ్డుకోవద్దని ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛాయుత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసి పోటీలో పాల్గొనేలా చూడాలని పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
