
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్ ‘ఏ’ జట్టుకు పాకిస్థాన్ ‘ఏ’ చేతిలో ఓటమి ఎదురైంది. అయితే ఈ మ్యాచ్ కేవలం ఆటతోనే కాకుండా మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పాక్ బ్యాటర్లను ఔట్ చేసిన సమయంలో భారత బౌలర్ హర్షిత్ రాణా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడు బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్ అయినప్పుడు పాక్ ఆటగాడు సుఫియాన్ హద్దులు దాటినట్లు కనిపించాడు. రాణాను దూషిస్తూ అతడి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే స్పందించిన పాక్ బౌలర్ అలీ రజా.. సుఫియాన్‌ను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు
క్రికెట్లో వికెట్ తీసినప్పుడు, సెంచరీ సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడం సహజం. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించే విషయంలో హద్దులు పాటించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ అంటే పాక్ క్రికెటర్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
ఇటీవల అండర్-19 ఆసియా కప్, అంధుల ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు కూడా చర్చకు వచ్చింది. అండర్-19 ఆసియా కప్ లీగ్ దశలో భారత్‌పై గెలిచిన తర్వాత పాక్ ఆటగాళ్లు అతిగా సంబరాలు చేసుకున్నారు. ఇక అంధుల ఆసియా కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినప్పటికీ ట్రోఫీని తీసుకెళ్లిన వ్యవహారం వివాదాస్పదమైంది. ఇప్పుడు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లోనూ ఆటగాళ్ల ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌కు చేరితే పోరు మరింత ఆసక్తికరంగా మారుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
షేక్ హ్యాండ్స్ వివాదంపై ఎంసీసీ వివరణ
ఈ టోర్నీలోనూ భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సమయంలోనే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. ఈ పరిణామం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) స్పందించింది. షేక్ హ్యాండ్స్ విషయంలో పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ వాటిని అమలు చేయించే అధికారం తమకు లేదని ఎంసీసీ ప్రతినిధి ఫ్రేజర్ స్టీవర్ట్ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోవాలని తాము కూడా కోరుకుంటామని, అయితే ఈ వ్యవహారం తమ నియంత్రణలో లేదని వివరించాడు. దీంతో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లలో క్రీడాస్ఫూర్తి, ఆటగాళ్ల ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది.




