Rising Stars Asia Cup 2026 Final: దోహా వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్-A చేతిలో 48 పరుగుల ఓటమి తర్వాత భారత్-A ప్రతీకారానికి సిద్ధమవుతోంది. ఫైనల్‌లో మళ్లీ తలపడాలంటే ఇరు జట్లు సెమీస్ గెలవాలి. నవంబర్ 29న ఫైనల్ జరగనుంది. అందుకు భారత్ ముందుగా యూఏఈను ఓడించాలి. నెట్ రన్‌రేట్, పాయింట్ల లెక్కలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..!

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో దోహా వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్-A 48 పరుగుల తేడాతో పాకిస్థాన్-A చేతిలో ఓడిపోయింది. స్లెడ్జింగ్, డ్రామా, సెండాఫ్‌లతో ఈ మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే లీగ్ మ్యాచ్ అయిపోయినా దాయాదుల పోరు ముగియలేదు. ఫైనల్లో మళ్లీ తలపడే ఛాన్స్ ఉంది.

మళ్లీ ఎప్పుడు తలపడతారు?

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 ఫైనల్ నవంబర్ 29న దోహాలోనే జరగనుంది. ఇరు జట్లు తమ సెమీఫైనల్స్ గెలిస్తే ఫైనల్లో మళ్లీ భారత్-A vs పాకిస్థాన్-A మ్యాచ్ ఖాయం.

పాకిస్థాన్-A భారత్‌పై 48 పరుగుల విజయంతో ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. కానీ భారత్-A అర్హత ఇంకా ఖరారు కాలేదు. ప్రతీకారం గురించి ఆలోచించే ముందు భారత్ యూఏఈతో జరిగే కీలక మ్యాచ్‌లో గెలవాలి. అంతేకాదు, గ్రూప్-Bలో ఇతర ఫలితాలు కూడా కలిసి రావాలని కోరుకోవాలి.

భారత్ సెమీస్ సమీకరణాలు:

భారత్-A సెమీస్‌కు వెళ్లేందుకు సులభమైన మార్గం చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈను ఓడించడమే. గెలిస్తే 4 పాయింట్లతో అర్హత రేసులో బలంగా నిలుస్తుంది.

అదే సమయంలో పాకిస్థాన్-A నేపాల్‌ను ఓడిస్తే భారత్ అర్హత సులభమవుతుంది. ఒకవేళ నేపాల్ పాక్‌ను ఓడిస్తే 4 పాయింట్లతో మూడు జట్ల మధ్య టై ఏర్పడుతుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది.

ప్రస్తుతం గ్రూప్-Bలో భారత్-A 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు, +2.580 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. కాబట్టి భారత్ భవితవ్యం చాలావరకు తన చేతుల్లోనే ఉంది.

పాక్‌తో ఓటమి నిరాశను మర్చిపోయి యూఏఈ మ్యాచ్‌పై పూర్తి దృష్టి పెడితేనే ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కుతుంది

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *