
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంబ నదిలో చెత్తాచెదారం వస్త్రాలు వేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మండల పూజ యాత్రకు వచ్చే భక్తులంతా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పంబ నదిలో వస్త్రాలు వ్యర్థాలు వేస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
పంబ నది నీరు కలుషితం కావడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పంబ నది, దాని ఉపనదుల్లోని స్నాన ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు పరిసరాల్లో భక్తులు వస్త్రాలు విడిచిపెట్టడం ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ తదితర చెత్తను వేయడంపై నిషేధం విధించారు.
పవిత్రమైన పంబ నది పరిశుభ్రతను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




