D Spiritual: Nov 23: నంద్యాల / పాలకొల్లు: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు, పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం అధికారులు దర్శనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు.

మరోవైపు, వేకువజామున నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఒక్కరోజే శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలోని శిరోభాగ నిలయంలో భక్తులు ‘హర హర మహాదేవ’ అంటూ కార్తీక దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *