రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs) దేశవ్యాప్తంగా 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 బేసిక్ జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. ఆన్లైన్ దరఖాస్తులకు నవంబర్ 25, 2026 చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 25తో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు
- పోస్టు పేరు: స్టేషన్ మాస్టర్
- మొత్తం ఖాళీలు: 1,265
- ఉద్యోగ సంస్థ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs)
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2026 నవంబర్ 25 నాటికి నిర్దేశిత విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు కల్పించారు. ఓబీసీ (నాన్ క్రీమీలేయర్): 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: 5 సంవత్సరాలు, మాజీ సైనికులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 25, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర అభ్యర్థులు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్జెండర్, మాజీ సైనికులు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు: రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. CBT పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించి దరఖాస్తు ఫీజును నిబంధనల ప్రకారం తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. CBT పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు. శిక్షణ సమయంలో నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు.




