నంద్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాగలమర్రి మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి చేయడంతో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే చాగలమర్రికి చెందిన వైసీపీకి చెందిన 150 కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అఖిలప్రియ చాగలమర్రికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు పూలదండలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో వారిపై వైసీపీ శ్రేణులు దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకే కొందరు వైసీపీ కార్యకర్తలు తమ పార్టీ శ్రేణులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ కార్యకర్తలను నియంత్రించడం తన వల్ల కూడా కాదంటూ హెచ్చరించారు. ఈ ఘటనతో చాగలమర్రిలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *