ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై ఇద్దరం బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని లోకేశ్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి ఇవే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పుకోవడానికి ఏముందని జగన్‌ను ప్రశ్నించారు.

రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌లు) దాఖలు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు సృష్టిస్తూ ఆ తర్వాత వాటి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమా? లేక బర్నాల్ పంపించాలా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన పోస్టుకు అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.

కాగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం యువతకు ఉపాధి కల్పించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరును పోలుస్తూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *