
ఆగ్రా, సాధారణంగా పెళ్లిళ్లలో బంధువులు, స్నేహితులు వధూవరులకు ఖరీదైన బహుమతులు అందిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా భారీ నగదు కానుక అందింది. ఇద్దరు వరులకు వారి బావమరిది చెరో రూ.కోటి విలువైన రూ.500 నోట్లతో తయారు చేసిన భారీ దండలను బహూకరించారు. దీంతో ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మథుర జిల్లాలోని నగ్లా ఫౌడా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ సింగ్, కాన్హా సింగ్ అనే ఇద్దరు కజిన్స్ వివాహంలో భాగంగా నిర్వహించిన ‘ఘుడ్చఢీ’ (గుర్రపు స్వారీ ఊరేగింపు) కార్యక్రమంలో ఈ భారీ కానుక అందజేశారు. రాజస్థాన్లోని కామా ప్రాంతం నందోలీ గ్రామానికి చెందిన వారి బావమరిది యోగేష్ కుమార్ ఠాకూర్ ఈ బహుమతిని అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రూ.500 నోట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన రెండు భారీ దండలను ఇద్దరు వరులకు బహూకరించారు. ఒక్కో దండ విలువ సుమారు రూ.కోటి కాగా, ఒక్కో దాని పొడవు దాదాపు 100 అడుగులుగా ఉన్నట్లు సమాచారం. దండలు భారీగా ఉండటంతో వాటిని మోయడానికి, సర్దడానికి పలువురు వ్యక్తులు సహాయం చేయాల్సి వచ్చింది. అనంతరం మథురలోని గోవర్ధన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు మార్బుల్, స్టోన్ షోరూమ్ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్గా వీడియోలు
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 100 అడుగుల పొడవైన నోట్ల దండలతో వరులు ఊరేగింపులో పాల్గొన్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. నగ్లా ఫౌడాతో పాటు పరిసర గ్రామాల్లోనూ ఈ భారీ నగదు కానుకపై చర్చ జరుగుతోంది. బావమరిది ఇచ్చిన విలాసవంతమైన బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.




