
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో విడుదలైన క్రిప్టోకరెన్సీ ‘ట్రంప్ మెమేకాయిన్’ ($TRUMP) విలువ భారీగా పతనమైంది. ఒకప్పుడు ఒక్కో టోకెన్ ధర సుమారు 75 డాలర్ల వరకు చేరగా.. ప్రస్తుతం డాలర్ కంటే దిగువకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్లో ఈ టోకెన్ విలువ గణనీయంగా తగ్గినప్పటికీ, అధిక సంఖ్యలో టోకెన్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ట్రంప్ ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు.
ఆదివారం రాత్రి వాషింగ్టన్ డీసీ సమీపంలోని తన ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో ఈ ప్రత్యేక విందు జరగనుంది. ఈ కార్యక్రమానికి ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తొలి విందుతో పోలిస్తే తగ్గిన ఆసక్తి
2025 మే నెలలో తొలిసారిగా ట్రంప్ మెమేకాయిన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక విందు నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 220 మంది సంపన్న క్రిప్టో పెట్టుబడిదారులు అర్హత సాధించారు. ఈ విందులో పాల్గొనేందుకు పెట్టుబడిదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తాజా విందుకు 185 క్రిప్టో వాలెట్లు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ నవంబర్ 16న పోటీ ముగిసే సమయానికి అధికారిక వెబ్సైట్లో కేవలం 130 వాలెట్ల వివరాలే కనిపించాయి.
ఈ వాలెట్లలో ఉన్న టోకెన్ల మొత్తం విలువ 8.6 మిలియన్ డాలర్లుగా నమోదైంది. 2025లో జరిగిన తొలి విందు సమయంలో ఇదే విలువ ఏకంగా 148 మిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే ట్రంప్ మెమేకాయిన్పై పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.




