
కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు.
ఆదివారం కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. కర్నూలులో గత 11 ఏళ్లుగా వనభోజనాల మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు ప్రాధాన్యత లభిస్తోందని టీజీ భరత్ అన్నారు. అనంతరం జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఓర్వకల్లు ప్రాంతానికి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు రావడంతో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధితో కర్నూలు రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే వారికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలవాలని మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




