
దేశంలో చమురు, సహజ వాయువు దిగుమతుల కోసం చేస్తున్న ఖర్చు భారీగా పెరిగింది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో నికర దిగుమతి వ్యయాలు 60 శాతం వృద్ధి చెంది 16 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర దాదాపు రెండింతలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఈ వివరాలను వెల్లడించింది.
2025 అక్టోబరులో దిగుమతి వ్యయాలు 10 బిలియన్ డాలర్లుగా ఉండగా.. గత నెలలో 16 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో ముడిచమురు దిగుమతుల పరిమాణం మాత్రం 11 శాతం పెరిగి 23.3 మిలియన్ టన్నులుగా నమోదైంది.
రెట్టింపైన బ్రెంట్ ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు సగటు బ్యారెల్ ధర గత నెలలో 124.77 డాలర్లకు చేరింది. 2025 అక్టోబరులో ఇది 64.75 డాలర్లుగా మాత్రమే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య చమురు నికర దిగుమతి వ్యయాలు 97.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం 70.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
గత నెలలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతుల కోసం 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా 6.3 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది.
తగ్గిన ఎల్పీజీ వినియోగం
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం తగ్గుముఖం పట్టింది. అక్టోబరులో గతేడాదితో పోలిస్తే 12.3 శాతం క్షీణత నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ఈ తగ్గుదల 15.1 శాతంగా ఉంది. నవంబరు 1 నాటికి దేశంలోని క్రియాశీల ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 32.6 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్ 1న ఈ సంఖ్య 33.4 కోట్లుగా ఉండేది.
ప్రైవేట్ సంస్థల ఎల్పీజీ దిగుమతులు అక్టోబరులో 83.8 శాతం, ఏప్రిల్-అక్టోబరు మధ్య 97.3 శాతం తగ్గాయి. ప్రభుత్వ రంగ సంస్థల గృహ వినియోగ సిలిండర్ల విక్రయాలు 11.8 శాతం, బల్క్ ఎల్పీజీ అమ్మకాలు 49.1 శాతం క్షీణించాయి. అయితే ఆటో ఎల్పీజీ విక్రయాలు మాత్రం 23.9 శాతం పెరిగాయి.
డీజిల్, పెట్రోల్ వినియోగంలో వృద్ధి
మరోవైపు డీజిల్, పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. అక్టోబరులో డీజిల్ వినియోగం 12 శాతం వృద్ధితో 8.5 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ అమ్మకాలు 3.5 శాతం, తారు వినియోగం 16.5 శాతం పెరిగాయి. మొత్తంగా పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2.7 శాతం వృద్ధి చెంది 20.5 మిలియన్ టన్నులుగా నమోదైంది.
అయితే ఏప్రిల్-అక్టోబరు మధ్య మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 3.2 శాతం తగ్గి 134.2 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇదే సమయంలో సహజ వాయువు వినియోగం 7.27 శాతం క్షీణించి 5,707 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు చేరింది.




