
టాటా స్టీల్ కీలక వ్యాపార విభాగాలను ఏపీఎల్ అపోలో ట్యూబ్స్‌కు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్ ట్యూబ్స్, పైప్స్ వ్యాపారంతో పాటు టాటా స్టీల్ కలర్స్ విభాగంలోని పూర్తి వాటాను విక్రయించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ రెండు లావాదేవీల మొత్తం విలువ రూ.28,000 కోట్లుగా ఉంది. స్టీల్ ట్యూబ్స్, పైప్స్ వ్యాపారాన్ని రూ.11,700 కోట్లకు, టాటా స్టీల్ కలర్స్ (టీఎస్‌సీఎల్)లోని పూర్తి వాటాను రూ.16,300 కోట్లకు విక్రయించనున్నట్లు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
నాలుగు కేంద్రాల్లో తయారీ కార్యకలాపాల బదిలీ
జంషెడ్‌పూర్, హోసూర్, ఖోపోలీ, సాహిబాబాద్‌లో ఉన్న స్టీల్ ట్యూబ్స్ తయారీ కేంద్రాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను ఏపీఎల్ అపోలోకు బదిలీ చేయనున్నారు. ఇందులో స్టీల్ ట్యూబ్స్, పైప్స్ తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, విక్రయాలు, పంపిణీ విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కోల్డ్ రోలింగ్, సర్ఫేస్ కోటెడ్ స్టీల్ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నాయి.
టాటా స్టీల్ కలర్స్‌లో 100 శాతం వాటా విక్రయం
టాటా స్టీల్ తన పూర్తి అనుబంధ సంస్థ అయిన టాటా స్టీల్ కలర్స్‌లోని మొత్తం వాటాను రూ.16,300 కోట్లకు ఏపీఎల్ అపోలోకు విక్రయించనుంది. ఈ సంస్థలో టాటా స్టీల్‌కు నేరుగా 50 శాతం వాటా ఉంది. మిగిలిన 50 శాతం వాటాను మరో అనుబంధ సంస్థ టాటా స్టీల్ డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ద్వారా పరోక్షంగా కలిగి ఉంది.
టాటా స్టీల్ నేరుగా 43.30 కోట్ల ఈక్విటీ షేర్లను కలిగి ఉండగా, మిగిలిన 43.30 కోట్ల షేర్లు అనుబంధ సంస్థ ద్వారా ఉన్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే టాటా స్టీల్‌కు చెందిన ఈ వ్యాపార విభాగాలు ఏపీఎల్ అపోలో ఆధీనంలోకి వెళ్లనున్నాయి.




