
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో భారతీయ కంపెనీలు తమ నియామక విధానాలను మార్చుకుంటున్నాయి. ఏఐ ఆధారిత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులను పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నాయి. అయితే మరోవైపు ఐటీ రంగంలో ప్రారంభ స్థాయి, జూనియర్ ఉద్యోగాల భర్తీ తగ్గుతోంది. ఆటోమేషన్ వినియోగం పెరిగే కొద్దీ రాబోయే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి రావచ్చని అనేక సంస్థలు భావిస్తున్నాయి. రాండ్‌స్టడ్ సంస్థ 11 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ప్రతి 10 కంపెనీల్లో 9 సంస్థల్లో టెక్ నియామకాలు
ఏఐ ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించుకునేందుకు దేశంలోని ప్రతి 10 కంపెనీల్లో 9 సంస్థలు తమ టెక్నాలజీ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 86 శాతంగా ఉండగా, 93 శాతంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అయితే అధునాతన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, అందుకు తగిన నిపుణులు అందుబాటులో లేకపోవడం కంపెనీలకు సవాలుగా మారింది.
మరోవైపు రెండేళ్ల క్రితంతో పోలిస్తే జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలను తగ్గించినట్లు 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. రాబోయే ఏడాది నుంచి రెండేళ్ల కాలంలో తమ టెక్నాలజీ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని 63 శాతం భారతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఆధునిక నైపుణ్యాలున్నవారికే ప్రాధాన్యం
ఐటీ రంగంలో నియామకాల తీరు మారుతున్నట్లు కంపెనీల ప్రకటనలు కూడా సూచిస్తున్నాయి. గత జూన్‌లోనే టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఉద్యోగ నియామకాల వేగం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్తగా నియమించుకునే ఉద్యోగుల్లో 80 శాతం మంది డిజిటల్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు కలిగినవారే ఉంటారని టీసీఎస్ ఇటీవల వెల్లడించింది.
హెచ్‌సీఎల్ టెక్ కూడా 2026-27లో ఏఐ సహా అధునాతన టెక్నాలజీలపై పట్టు ఉన్న అభ్యర్థుల నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఎలైట్ ఇంజినీర్స్ నియామకాలను పెంచింది.
ఏఐ నిపుణులకు రెట్టింపు వేతనాలు
సంప్రదాయ సాఫ్ట్వేర్ డెవలపర్లతో పోలిస్తే ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి అధిక వేతనాలు లభిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరు రెట్టింపునకు మించిన జీతాలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ టెక్నాలజీ ఉద్యోగులు, ఏఐ నిపుణుల వేతనాల మధ్య వ్యత్యాసం గరిష్ఠంగా 79 శాతానికి చేరినట్లు నివేదిక పేర్కొంది.
అయితే అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్న పోటీ సంస్థల కారణంగా తమ ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతున్నామని సగం కంపెనీలు వెల్లడించాయి. ఏఐ నిపుణులను నియమించుకునేందుకు 73 శాతం సంస్థలు ఫ్లెక్సిబుల్ విధానాలను అనుసరిస్తుండగా, కేవలం 26 శాతం కంపెనీలే శాశ్వత ఉద్యోగ నియామకాలపై ఆధారపడుతున్నాయి.
బయటి నిపుణులకు అధిక వేతనాలు చెల్లించడం కంటే, ఇప్పటికే తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం దీర్ఘకాలంలో ప్రయోజనకరమని 36 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
ఏఐ అమలుకు ఖర్చులు కూడా ఎక్కువే
ఏఐ సాంకేతికతను అమలు చేయడం ద్వారా పెట్టుబడికి మించి ఆదాయం లేదా ప్రయోజనం పొందుతున్నామని 41 శాతం కంపెనీలు తెలిపాయి. అయితే సాఫ్ట్వేర్ లైసెన్సులు, కంప్యూటింగ్ వనరులు, టోకెన్ వినియోగం వంటి నిర్వహణ ఖర్చులు అంచనాలను మించుతున్నాయని 54 శాతం సంస్థలు వెల్లడించాయి.
ఏఐ టూల్స్ నిర్వహణకు అయ్యే వ్యయం, అదే పనిని చేసేందుకు జూనియర్ ఉద్యోగులను నియమించుకునే ఖర్చుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటోందని 72 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.
నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలి
కంపెనీలు ఏఐ నిపుణులను నియమించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం, ఆటోమేషన్‌ను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా తెలిపారు.
భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉండే నైపుణ్యాలను ముందుగానే గుర్తించి, అందుకు అనుగుణంగా సిద్ధమయ్యే సంస్థలకే పోటీ ప్రపంచంలో ప్రయోజనం ఉంటుందని రాండ్‌స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ అయ్యర్ పేర్కొన్నారు. మొత్తంగా ఏఐ విస్తరణతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు పెరుగుతుండగా, ఫ్రెషర్లు కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించాల్సిన అవసరం ఏర్పడుతోంది.



