
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించేందుకు వియత్నాంకు చెందిన వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2027 ప్రథమార్ధంలో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న కార్ల తయారీ కేంద్రంలోనే ద్విచక్ర వాహనాల ఉత్పత్తి కోసం ప్రత్యేక లైన్ను ఏర్పాటు చేసినట్లు విన్ఫాస్ట్ ఇండియా టూ-వీలర్స్ మార్కెట్ సీఈఓ అనురాగ్ సక్సేనా వెల్లడించారు.
తమిళనాడులో తయారీ సామర్థ్యం పెంపు
భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు విన్ఫాస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తూత్తుకుడిలోని ప్లాంటు విస్తరణ కోసం అదనంగా 500 ఎకరాల భూమిని సేకరించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చర్యలతో భారత మార్కెట్లో తన కార్యకలాపాలను విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ కార్ల విక్రయం
విన్ఫాస్ట్ ప్రస్తుతం భారత్లో నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో వీఎఫ్ 6, వీఎఫ్ 7, వీఎఫ్ ఎంపీవీ 7, లిమో గ్రీన్ మోడళ్లు ఉన్నాయి. దేశంలో కాంపాక్ట్ ఎస్యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, మరో రెండు బ్యాటరీ ఆధారిత కార్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
2030 నాటికి కీలక స్థానం లక్ష్యం
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో 2030 నాటికి గణనీయమైన వాటాను సాధించడమే తమ లక్ష్యమని విన్ఫాస్ట్ ఆసియా ఫోర్-వీలర్స్ బిజినెస్ సీఈఓ తపన్ ఘోష్ తెలిపారు. కార్లతో పాటు ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం ద్వారా దేశీయ ఈవీ మార్కెట్లో మరింత విస్తరించాలని సంస్థ భావిస్తోంది.



