
ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఏలూరు, మచిలీపట్నం తదితర నగరాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. నేటి నుంచి నూతన కౌన్సిళ్ల పదవీకాలం ప్రారంభమైంది.
విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ లక్ష్మీ శా ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం నగర కార్పొరేటర్లతో వరుసగా ప్రమాణ స్వీకారం చేయించారు.
మరోవైపు డోన్ మున్సిపల్ ఛైర్మన్‌గా కోట్ల సుజాతమ్మ, ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, కర్నూలు మేయర్‌గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష, తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పసుపులేటి మాధవి బాధ్యతలు స్వీకరించారు.
కర్నూలు నగర మేయర్‌గా ఎన్నికైన బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో జిల్లా కలెక్టర్ సిరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వార్డు సభ్యులతోనూ ప్రమాణం చేయించారు. నూతన మేయర్‌కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తొలుత మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదాతో ప్రమాణం చేయించారు. ఆమె ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం తెలుగు అక్షర క్రమంలో 60 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏఈడీ స్క్రీన్ల ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఇక గుంటూరు నగర నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 76 మంది కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రమాణం చేయించారు. నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ నగర అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అందరూ సమన్వయంతో పనిచేసి గుంటూరును మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా గుంటూరు నగర డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి కార్పొరేటర్లు ఆయనకు మద్దతు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని పలు నగరాలు పట్టణాల్లో నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించడంతో స్థానిక పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.




