
ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేశ్‌ను రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అయితే పెట్టుబడుల విషయంలో అభినందించాల్సింది పోయి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి మీడియా విమర్శలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
సోమవారం రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి వస్తున్న భారీ పెట్టుబడులను చూసి ఇతర రాష్ట్రాలు అసూయపడే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పెట్టుబడులు వస్తుంటే వాటిని స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం బాధాకరమన్నారు.
జగన్, ఆయనకు చెందిన సాక్షి మీడియాకు మానవీయ కోణం లేకుండా పోయిందని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రం నాశనం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు రావాలని తిరిగి వైసీపీ అధికారంలోకి రావాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలని ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏపీకి వస్తున్నాయని సోమిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణలో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారని కొనియాడారు. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణలో మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం లోకేశ్ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని వీటి ద్వారా 22.78 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. గూగుల్ రూ.1.33 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.43 వేల కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రూ.1.06 లక్షల కోట్లు, రెన్యూ రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నాయని వివరించారు.
తన సర్వేపల్లి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంటోందని సోమిరెడ్డి చెప్పారు. శ్యామ్ మెటాలిక్ ఎనర్జీ సంస్థ రూ.3,600 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని పలు పామాయిల్ పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమల రాకతో స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.




