
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న సాలకట్ల కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేతి వత్తులతో దీపాలను వెలిగించి, ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం నిర్వహించి ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారికి హారతి సమర్పించనున్నారు.
అనంతరం గర్భాలయంలో అఖండ దీపం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు తదితర ప్రాంతాల్లో దీపోత్సవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. తిరుమల కొండపై ఉన్న ఇతర ఆలయాల వద్ద కూడా దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
కార్తీకమాసం సందర్భంగా గరుడసేవతో పాటు సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.




