కృత్రిమ మేధ యుగంలో నాయకత్వానికి కొత్త నిర్వచనం అవసరమని నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు దేబ్జానీ ఘోష్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత కంటే ప్రజల జీవితాల్లో వచ్చే మార్పే ముఖ్యమని వివరించారు. మానవీయ విలువలు, జవాబుదారీతనం, నిరంతర అభ్యాసం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం వంటి నాలుగు కీలక నాయకత్వ సూత్రాలను తన ప్రత్యేక వ్యాసంలో ప్రస్తావించారు.
నాయకత్వం అంటే ఒక యజ్ఞం.. కృత్రిమ మేధ (AI) యుగంలో మానవీయ విలువలే అసలైన గీటురాయంటూ నీతి ఆయోగ్ విశిష్ట సభ్యురాలు దేబ్జానీ ఘోష్ వివరించారు.. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ గురించి ఓ ప్రత్యేక వ్యాసాన్ని పంచుకున్నారు.

2012లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన తొలి సమావేశం నా మదిలో ఎప్పటికీ చెరిగిపోదు. అప్పట్లో ఒక అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థకు దక్షిణాసియా విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టి, గుజరాత్ పాఠశాలల్లో కంప్యూటర్ల ద్వారా విద్యావ్యవస్థను ఎలా మార్చవచ్చో వివరించేందుకు వెళ్లాను. మేము తీసుకొస్తున్న సాంకేతికత ఎంత అద్భుతమైనదో వివరిస్తూ నేను సిద్ధం చేసిన ప్రజెంటేషన్‌ను ఆయన ఎంతో ఓపికగా విన్నారు. ఆ తర్వాత ఒకే ఒక్క సూటి ప్రశ్న వేశారు: “దీనివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమిటి?”
నేను టెక్నాలజీ గొప్పతనం గురించి మళ్లీ మళ్లీ చెబుతున్నా, ఆయన అదే ప్రశ్నను పునరావృతం చేశారు. కాసేపు ఆగి ఆయన మాటలను లోతుగా ఆలోచించినప్పుడు నాకు అసలు సత్యం బోధపడింది. ప్రాసెసర్లోని ట్రాన్సిస్టర్ల సంఖ్య లేదా దాని వేగం టెక్నాలజీకి కొలమానం కాదు; సామాన్యులు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, వారి అనుభవాలను అది ఎలా మారుస్తోంది, అంతిమంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తెస్తోంది అన్నదే నిజమైన ప్రమాణం. సాంకేతికతను దాని సామర్థ్యంతో కాకుండా, అది చూపే ప్రభావం (Impact) ఆధారంగా కొలవాలని ఆయన నాకు నేర్పారు. ఆ పాఠానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.
నేడు మనం అత్యంత కీలకమైన సాంకేతిక పరివర్తన దశలోకి అడుగుపెడుతున్న వేళ, ఆ పాఠం మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటి టెక్ పరిశ్రమ మానవ మేధస్సును మించే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) రూపకల్పన కోసం పరుగులు పెడుతోంది. కానీ, ఇది మానవాళికి ఏం చేస్తుందనే ప్రశ్నను మనం తగినంతగా వేసుకుంటున్నామా? మరింత శక్తివంతమైన యంత్రాలను నిర్మించడం కంటే, ఆ శక్తితో మానవ పురోగతిని ముందుకు తీసుకెళ్లడమే ఏఐ పరిశ్రమకు దిక్సూచి కావాలి. ఇందుకోసం నాయకత్వ లక్షణాలను పూర్తిగా పునర్నిర్వచించుకోవాలి. డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం రాసిన ‘పవర్ వితిన్’ పుస్తకంలో చెప్పినట్లుగా—లక్ష్యం, సేవాభావం, ఇతరుల సామర్థ్యాలను పెంపొందించే బాధ్యతతో కూడిన ‘మిషన్ తరహా నాయకత్వం’ నేడు అవసరం. దీనిని సాధించాలంటే నాయకత్వంపై ఉన్న నాలుగు పాత నమ్మకాలను మనం సవాలు చేయాలి:
సాంకేతికత నుంచి ‘ప్రభావం’ వైపు దృష్టి మళ్లాలి:
సాంకేతిక పురోగతి జరిగితే మానవ ప్రగతి దానంతట అదే జరుగుతుందని భ్రమపడకూడదు.. మానవ వికాసమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. నా జీవితంలో అత్యంత గర్వపడే విజయాలను గుర్తుచేసుకున్నప్పుడల్లా, కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా మేము నిర్వహించిన కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమం గుర్తొస్తుంది. తెలంగాణలోని ఒక కేంద్రాన్ని సందర్శించినప్పుడు ‘ఫాతిమా’ అనే బామ్మను కలిశాను. ఆ కార్యక్రమంలో ఆమె ఎంతో ఉత్సాహంగా పాల్గొనేది. కారణం అడిగితే—తన జీవితంలో ఎప్పుడూ పేరు రాయడం నేర్చుకోలేదని, ఎప్పుడూ వేలిముద్రే వేసేదాన్నని చెప్పింది. కానీ ఈ కార్యక్రమం ద్వారా కంప్యూటర్లో తన పేరు టైప్ చేయడం నేర్చుకున్నానంటూ, “దీదీ, ఈ కంప్యూటర్ నాకు నా గుర్తింపును ఇచ్చిందిష అని ఆనందంతో చెప్పింది. సాంకేతికతను సరైన దిశలో నడిపించడం అంటే ఇదే!
బాధ్యతను యంత్రాలకు అప్పగించలేము:
భవిష్యత్తులో స్వయంప్రతిపత్తి కలిగిన (Autonomous) ఏఐ వ్యవస్థలతో మనం కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజల ఉద్యోగాలు, జీవనోపాధి, రుణ సదుపాయం, వైద్యం వంటి కీలక అంశాల్లో ఏఐ వ్యవస్థలు వేలాది నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు—ఆ నిర్ణయాలు తప్పు అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? యంత్రాల స్వయంప్రతిపత్తిని సాకుగా చూపి మానవ జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేము. యంత్రాలకు ఎంత స్వేచ్ఛ ఇస్తామో, వాటికి సరిహద్దులు నిర్ణయించడం, ప్రమాదాలను అంచనా వేయడం, తమ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించడం నాయకుల బాధ్యత. యంత్రాలు నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ, జవాబుదారీతనం మాత్రం కచ్చితంగా మనుషుల చేతుల్లోనే ఉండాలి.
లక్ష్యం స్థిరంగా.. వ్యూహం సరళంగా ఉండాలి:
సాంకేతికత మారుతున్న వేగం ముందు సంప్రదాయ ప్రణాళికలు నిలబడలేకపోతున్నాయి. రెండేళ్ల తర్వాత ఏఐ సామర్థ్యం ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితుల్లో ఐదేళ్ల ప్రణాళికలు ఎలా వేయగలము? దీని అర్థం ప్రణాళికలు మానుకోవాలని కాదు, ప్రణాళికలు వేసే పద్ధతిని మార్చుకోవాలని. ఉదాహరణకు ఏఐ నైపుణ్య శిక్షణనే తీసుకోండి: ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువతను సిద్ధం చేయడం మన లక్ష్యం. కానీ నేటి టూల్స్ ఆధారంగా రూపొందించిన కోర్సులు, విద్యార్థులు పూర్తి చేసేలోపే కాలం చెల్లిపోవచ్చు. కాబట్టి లక్ష్యం మారకూడదు కానీ, ఏం బోధించాలి, ఎలా బోధించాలి, విజయాన్ని ఎలా కొలవాలి అనే వ్యూహాలు నిరంతరం మారుతూ ఉండాలి. ప్రణాళికను మార్చుకోవడాన్ని వైఫల్యంగా కాకుండా, లక్ష్య సాధనలో భాగంగా చూడాలి.
నాయకులు నిత్య విద్యార్థులుగా మారాలి:
దశాబ్దాలుగా నాయకత్వం అంటే అనుభవం, నైపుణ్యం, అన్నింటికీ సమాధానాలు తెలిసి ఉండటమే అనుకునేవారు. స్థాయి పెరిగేకొద్దీ అన్నీ తెలిసి ఉండాలనే అంచనాలు ఉండేవి. ఏఐ ఆ ఆలోచనను తలకిందులు చేస్తోంది. సాంకేతికత ఎంత వేగంగా మారుతోందంటే నిపుణులు సైతం దాని వేగాన్ని అందుకోలేకపోతున్నారు. గత విజయాలు భవిష్యత్తుకు హామీ ఇవ్వలేవు. అందుకే ‘మేధోపరమైన వినయం’ (Intellectual Humility) అత్యంత కీలకమైన నాయకత్వ లక్షణంగా మారనుంది. మనకు తెలియని విషయాలను నిజాయితీగా అంగీకరించడం, మన నమ్మకాలను ప్రశ్నించుకోవడం, వయసు లేదా హోదాతో సంబంధం లేకుండా ఎవరి నుంచైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం నేడు ఎంతో అవసరం.
వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో, మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫలితాలను నిర్ణయించేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు—నాయకులుగా మనం తీసుకునే నిర్ణయాలే! సాంకేతిక పురోగతి పట్ల ఆశయం ఉంటూనే, అది సామాన్య ప్రజల జీవితాల్లో తెచ్చే మార్పును ప్రేరణగా తీసుకునే నాయకులు నేడు కావాలి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నన్ను ఆలోచింపజేసిన ఆ ఒక్క ప్రశ్న—”ఇది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెస్తోంది?.. ఏఐ యుగంలో ప్రతి నాయకుడికి అసలైన పరీక్షగా నిలవనుంది.




