
విజయవాడ నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మేయర్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణతోనే కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు.
తొలుత విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం కార్పొరేటర్లు బాధ్యతలు స్వీకరించారని ఎంపీ వివరించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగిందని చెన్నుపాటి కాంతిశ్రీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వెల్లడించారు. కూటమి ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక సమష్టి కృషి ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కూటమికి మద్దతు తెలిపారని అన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేసి విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నగరానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ ఎంపిక వెనుక ఆమె కుటుంబం చేసిన సేవలు, పోరాటం ఉన్నాయని ఎంపీ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడిలో ఆమె భర్త కన్ను కోల్పోయారని పేర్కొన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి పోరాడిన కుటుంబానికి గుర్తింపుగా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు కూడా వారి కుటుంబ ధైర్యసాహసాలను గుర్తించి ఈ అవకాశం కల్పించారని తెలిపారు.
మరోవైపు అంబేడ్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందని మేయర్ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అంబేడ్కర్ పాదాల చెంత ప్రజాసేవ బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డిప్యూటీ మేయర్‌గా తనను ఎన్నుకున్న సభ్యులందరికీ చెన్నుపాటి కాంతిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌తో కలిసి నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, అవసరాలను గుర్తిస్తామని చెప్పారు. అందరినీ కలుపుకొని విజయవాడ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు.




