
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలకు షా ఘాటుగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం, గతాన్ని ప్రస్తావిస్తూ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశాడు. అందులో యోగ్రాజ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
పృథ్వీ షా కెరీర్‌పై యోగ్రాజ్ సంచలన వ్యాఖ్యలు
స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ సింగ్ పృథ్వీ షా కెరీర్‌పై విమర్శలు చేశాడు. అతడి ఆట పతనానికి వ్యక్తిగత జీవనశైలి కారణమని అభిప్రాయపడ్డాడు. గతంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఎదుర్కొన్న పరిస్థితులతో షా కెరీర్‌ను పోల్చాడు.
పార్టీలు, చెడు స్నేహాలు, మద్యం, సిగరెట్ల వంటి అలవాట్లు ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపుతాయని యోగ్రాజ్ పేర్కొన్నాడు. కాంబ్లీకి అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు పార్టీల్లో గడిపేవాడని, ఒకసారి ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు తన రోజులు ముగిశాయని సమాధానమిచ్చాడని గుర్తుచేసుకున్నాడు. ఇలాంటి అలవాట్లే చివరకు అతడి క్రికెట్ కెరీర్‌పై ప్రభావం చూపాయని వివరించాడు. పృథ్వీ షా విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని వ్యాఖ్యానించాడు.
నా గతాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయొద్దు: షా
యోగ్రాజ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ తన గతం గురించి దాచాల్సిందేమీ లేదని స్పష్టం చేశాడు. తన జీవితంలో జరిగిన విషయాలను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడం సహించబోనని తెలిపాడు.
అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు. తన పేరు, వ్యక్తిగత జీవితం, గతాన్ని ఉపయోగించుకుని తప్పుడు ప్రచారం చేసే వారికి ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టం చేశాడు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులు లేదా ప్లాట్‌ఫామ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తన పోస్టులో హెచ్చరించాడు.




