తెలంగాణలో స్టీవియా పంట సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఈ పంటను ఏడాదికి నాలుగు విడతలుగా కోత కోయవచ్చని.. సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించుకుని సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

స్టీవియా సాగుపై రైతులకు శాస్త్రీయ అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రాజేంద్రనగర్‌లో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడంతో పాటు సాగు విధానాలపై శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

కాగా, స్టీవియా ఆకుల్లో సహజమైన తీపి పదార్థాలు ఉంటాయి. వీటిని చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. దీంతో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో స్టీవియా పంటకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు

సాంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్త రకాల పంటలను సాగు చేస్తేనే రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పలువురు రైతులు వ్యవసాయంలో కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్, జెరేనియం వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇదే తరహాలో చక్కెరకు సహజ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే స్టీవియా సాగుకు కూడా తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి వెల్లడించారు.

రాజేంద్రనగర్‌లోని హార్టికల్చర్ కాలేజీలో పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ (PRTIS), గ్లోబల్ స్టీవియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో జాతీయ స్టీవియా సమ్మిట్–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు స్టీవియా సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ పంటపై దృష్టి సారిస్తే సంప్రదాయ వ్యవసాయానికి మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏడాదికి నాలుగు విడతలుగా కోతకు వచ్చే స్టీవియా పంటను సరైన మార్కెటింగ్ వ్యవస్థతో సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్టీవియా సాగు విధానాలు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై రైతులు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం రైతులు, వ్యాపారవేత్తలు, వినియోగదారుల్లో స్టీవియా పంటపై తగినంత అవగాహన లేదని.. ఇలాంటి సమావేశాల ద్వారా ఈ పంట సాగులో ఉన్న అవకాశాలను విస్తృతంగా వివరించవచ్చని పేర్కొన్నారు.

స్టీవియా సాగుకు అనుకూలమైన వాతావరణం

తెలంగాణలో స్టీవియా సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 15 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఈ పంట బాగా పెరుగుతుంది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు దీనికి అనుకూలంగా ఉండటంతో రైతులు స్టీవియా సాగుపై దృష్టి సారించవచ్చని సూచిస్తున్నారు.

నీరు నిల్వ ఉండని ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన గరప నేలలు స్టీవియా సాగుకు మరింత అనుకూలంగా ఉంటాయి. ఒకసారి మొక్కలు నాటితే సుమారు 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆకుల దిగుబడి పొందవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆకులను కోసి విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అయితే పంట సాగు ప్రారంభించే ముందే కొనుగోలు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం (కాంట్రాక్ట్ ఫార్మింగ్) మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు తగ్గుతాయి.

స్టీవియా ఆకుల్లో సహజంగా స్టీవియోల్ గ్లైకోసైడ్స్ అనే తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి సాధారణ చక్కెరతో పోలిస్తే 200 నుంచి 300 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. అందుకే స్టీవియా ఆకుల నుంచి తయారుచేసే ఉత్పత్తులను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.

స్టీవియా ఆకుల నుంచి తీపి పదార్థం తయారీ విధానం

స్టీవియా మొక్కలు పూతకు రాకముందే వాటి ఆకులను కోస్తారు. సేకరించిన ఆకులను నేరుగా ఎండలో కాకుండా నీడలో లేదా డ్రయ్యర్లలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆరబెడతారు. ఆకుల్లోని తేమ పూర్తిగా తొలగి, అవి చేతితో తాకగానే పొడిగా విరిగిపోయే స్థితికి వచ్చే వరకు ఎండబెడతారు. ఇలా ఆరిన ఆకులను మెత్తని పొడిగా తయారుచేస్తారు.

ఆ తర్వాత ఈ పొడిని 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో నానబెడతారు. ఈ ప్రక్రియలో ఆకుల్లోని సహజ తీపి పదార్థాలు నీటిలో కరిగిపోతాయి. అయితే ఈ ద్రావణంలో ఆకుపచ్చ రంగుతో పాటు ఇతర మలినాలు, కొంత చేదు గుణం కూడా ఉంటాయి. వాటిని తొలగించేందుకు అల్ట్రా ఫిల్ట్రేషన్, యాక్టివేటెడ్ కార్బన్, అయాన్ ఎక్స్ఛేంజ్ రెసిన్స్ వంటి పద్ధతులతో శుద్ధి చేస్తారు.

శుద్ధి చేసిన ద్రావణంలోని నీటిని ఆవిరి చేయడం ద్వారా దాన్ని చిక్కగా మారుస్తారు. అనంతరం స్ప్రే డ్రైయింగ్ లేదా క్రిస్టలైజేషన్ ప్రక్రియ ద్వారా తెల్లటి స్ఫటికాలు లేదా మెత్తని పొడి రూపంలోకి మారుస్తారు. ఇలా తయారైన స్టీవియా ఉత్పత్తులను సాధారణ చక్కెరకు సహజ ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. ఆహార పదార్థాలు, పానీయాలు, ఇతర ఉత్పత్తుల్లోనూ వీటిని ఉపయోగించే అవకాశం ఉంది.

తెలంగాణలో స్టీవియా సాగు చేయాలనుకునే రైతులకు హైదరాబాద్ బోడుప్పల్‌లోని CSIR – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్‌లో మొక్కలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ నాణ్యమైన స్టీవియా మొక్కలతో పాటు సాగు విధానాలు, శిక్షణ, కొనుగోలుదారుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం 040-27201131, 040-27200272 నంబర్లలో సంప్రదించవచ్చు.

మరోవైపు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ప్రత్యేక స్టీవియా నర్సరీ ఏర్పాటు చేసి రైతులకు మొక్కలు, శాస్త్రీయ సాగు పరిజ్ఞానం అందించేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ చర్యలు చేపడుతోంది.

స్టీవియా సాగుకు సబ్సిడీ కూడా!

తెలంగాణ ఉద్యానశాఖ, రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు పథకాల ద్వారా స్టీవియా సాగుకు సుమారు 20 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అర్హతలు, ప్రస్తుత సబ్సిడీ వివరాల కోసం రైతులు తమ జిల్లాలోని జిల్లా ఉద్యాన అధికారి లేదా మండల హార్టికల్చర్ అధికారి కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

ఎకరాకు ఎన్ని మొక్కలు అవసరం?

స్టీవియా సాగుకు ఒక ఎకరానికి సుమారు 30 వేల నుంచి 40 వేల మొక్కలు అవసరమవుతాయి. మొక్కల రకాన్ని బట్టి ఒక్కో మొక్క ధర రూ.3 నుంచి రూ.6 వరకు ఉంటుంది. ఈ లెక్కన మొక్కల కొనుగోలుకే ఎకరానికి సుమారు రూ.90 వేల నుంచి రూ.2.40 లక్షల వరకు ఖర్చు కావచ్చు.

మార్కెటింగ్‌పై ముందుగానే దృష్టి పెట్టాలి

స్టీవియా సాగులో రైతులు ముఖ్యంగా మార్కెటింగ్ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పంట ఆకులను సాధారణ మార్కెట్లలో నేరుగా విక్రయించడం అంత సులభం కాదు. కాబట్టి సాగు ప్రారంభించే ముందే ఎండిన ఆకులను కొనుగోలు చేసే ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను సంప్రదించాలి. వీలైతే కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకోవాలి. అలా ముందుగానే కొనుగోలుదారులను నిర్ధారించుకుంటే పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *