పహల్గాంలో గత ఏడాది ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి ముందు చైనా భూపరిశీలన ఉపగ్రహాల కదలికలు అనుమానాలకు తావిస్తున్నాయి. దాడికి ఆరు రోజుల ముందే పహల్గాం ప్రాంతంపై నిఘా పెంచేలా చైనా ఉపగ్రహాలు అసాధారణంగా కక్ష్య మార్పులు చేసినట్లు బెంగళూరుకు చెందిన అంతరిక్ష నిఘా స్టార్టప్‌ దిగంతర విశ్లేషణ వెల్లడించింది. 2025 ఏప్రిల్‌ 15 నుంచి 30 మధ్య మొత్తం 37 అసాధారణ కక్ష్య మార్పులను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.

‘ది ప్రింట్‌’కు ప్రత్యేకంగా అందిన ఈ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్‌ 16న యావోగాన్‌-35 01ఎ ఉపగ్రహం తన కక్ష్యను మార్చుకోవడంతో పహల్గాం ప్రాంతంపై దాని పర్యవేక్షణ అవకాశాలు రెట్టింపయ్యాయి. దాడి జరిగిన రోజున కూడా రెండు చైనా ఉపగ్రహాలు తమ కక్ష్యలను మార్చుకున్నాయి. యావోగాన్‌-39 01బీ, యావోగాన్‌-39 01సీ ఉపగ్రహాలు అదే రోజు సాయంత్రం 5.14, 5.59 గంటలకు కక్ష్య మార్పులు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

దాడి తర్వాతా కొనసాగిన కదలికలు

దాడికి ముందు, తర్వాత చైనా ఉపగ్రహాల కదలికల్లో అసాధారణ మార్పులు నమోదయ్యాయని దిగంతర విశ్లేషణ తెలిపింది. ఏప్రిల్‌ 29న 37, ఏప్రిల్‌ 30న 31 కక్ష్య మార్పులు జరిగినట్లు పేర్కొంది. ఈ సర్దుబాట్లతో ఉపగ్రహాలు పహల్గాం ప్రాంతంపై మరింత తరచుగా ప్రయాణించి, ఆ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశాలు పెరిగాయని వివరించింది.

ఉగ్రదాడితో సంబంధంపై స్పష్టత లేదు

అయితే చైనా ఉపగ్రహాల కక్ష్య మార్పులకు పహల్గాం ఉగ్రదాడితో ప్రత్యక్ష సంబంధం ఉందని ఈ నివేదిక నిర్ధారించలేదు. భద్రతా దళాల కదలికలను పరిశీలించడం లేదా ఉగ్రవాదులు తప్పించుకునే మార్గాలను అంచనా వేయడం కోసం ఉపగ్రహాల ద్వారా నిఘా నిర్వహించి ఉండవచ్చన్నది కేవలం ఒక ఊహ మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

భూమిపై నిర్దిష్ట ప్రాంతాన్ని ఉపగ్రహాలు ఎప్పుడు, ఎన్నిసార్లు దాటుతాయో మార్చేందుకు వాటి కక్ష్య, దిశ లేదా వేగాన్ని నియంత్రితంగా సర్దుబాటు చేయడాన్నే కక్ష్య మార్పు అంటారు. ఈ మార్పుల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాన్ని మరింత తరచుగా పరిశీలించే అవకాశం ఉంటుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *