
D Spiritual: Nov 24: సింహాచలంలో శ్రీనృసింహ మండల దీక్షలు ప్రారంభం
సింహాచలం: సింహాద్రి అప్పన్నస్వామిపై భక్తితో ఏటా భక్తులు చేపట్టే శ్రీనృసింహ మండల దీక్షలు సోమవారం సింహగిరిపై సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఈ దీక్షధారణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల నేతృత్వంలో అర్చక పరివారం శాస్త్రోక్తంగా జరిపించారు.
తొలుత దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు, అధికారులు, అర్చకులు దీక్షధారణకు సంబంధించిన సామగ్రిని ఆలయ బేడామండపం చుట్టూ ప్రదక్షిణ చేసి, అనంతరం అంతరాలయంలో స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాడవీధుల మీదుగా ఊరేగింపుగా ఆలయ ఉత్తర గోపురం సమీపంలోని వార్షిక కల్యాణోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అప్పన్నస్వామి నమూనా విగ్రహం వద్ద అర్చకులు తులసి మాలలు, రాగిమాడలకు ఆవాహన పూజలు నిర్వహించారు. అనంతరం దీక్ష చేపట్టిన భక్తులకు మాలధారణ చేశారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. డిసెంబరు 2న 32 రోజుల మూలమంత్ర దీక్షలు ప్రారంభమవుతాయని, మండల, మూలమంత్ర దీక్షలు జనవరి 2న ముగుస్తాయని ఈవో జల్లేపల్లి వెంకటరావు వివరించారు. దేవస్థానం సూచించిన తేదీల్లోనే భక్తులు మాలధారణ, దీక్ష విరమణ చేయాలని సూచించారు.
దీక్షల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో శ్రీనివాసరావు, పర్యవేక్షకుడు సూర్యనారాయణ పర్యవేక్షించారు.




