
D Spiritual: Nov 24: మంత్రాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. సత్యనారాయణ స్వామికి విశేష పూజలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రత పూజను శాస్త్రోక్తంగా జరిపించారు.
శ్రీమఠంలోని యజ్ఞమంటపంలో ప్రత్యేక ఆసనంపై సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి అర్చకులు డోన్ రాఘవేంద్రాచార్, వ్యాసరాజాచార్ విశేష పూజలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ, లక్ష్మీ పూజ, నవగ్రహ పూజలను జరిపించారు. అనంతరం సత్యనారాయణ స్వామి కాంస్య విగ్రహానికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించి మహా మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు డోన్ రాఘవేంద్రాచార్, వ్యాసరాజాచార్తో పాటు శిష్య బృందం సభ్యులు ఆకాశ్ ఆచార్, రాఘవేంద్ర ఆచార్, వ్యాస తత్వజ్ఞ పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే తుంగభద్రా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మను, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. తుంగభద్రా నది తీరంతో పాటు శ్రీమఠంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం నిర్వహించిన సత్యనారాయణ స్వామి పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
మృత్తికా బృందావనానికి బంగారు పల్లకి సేవ
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీమఠంలోని రాఘవేంద్ర స్వామి మృత్తికా బృందావనానికి అర్చకులు బంగారు పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని బంగారు పల్లకిలో ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు. ఈ సేవను వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
మూలరాములకు విశేష పూజలు
పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు పూజా మందిరంలో జయ, దిగ్విజయ, మూలరాములకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరత్నాలతో అభిషేకం గావించి మహా మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందజేసి ఆశీర్వదించారు.
సాయంత్రం వైభవంగా లక్షదీపోత్సవం
పవిత్ర తుంగభద్రా నది తీరంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు లక్షదీపోత్సవం (పుణ్యహారతి) నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాసరావు తెలిపారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను శ్రీమఠం నుంచి ఊరేగింపుగా తుంగభద్రా నది తీరానికి తీసుకెళ్తారు.
అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ సందేశం అందిస్తారు. తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పిస్తారు. పీఠాధిపతి కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం అర్చకులు ఏడు రకాల దీపకాంతులతో తుంగభద్రా నదికి హారతి ఇస్తారు. చివరగా భక్తులు నదీ తీరంలో కార్తీక దీపాలను వెలిగించి లక్షదీపోత్సవంలో పాల్గొంటారు. ఈ వేడుకలతో మంత్రాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.




