
ఈవీఎం గోడౌన్ల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించే నెలవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం పక్కన ఉన్న ఈవీఎం గోడౌన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, లాక్బుక్ల నిర్వహణను తనిఖీ చేశారు.
గోడౌన్ల వద్ద భద్రతా చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిబంధనల ప్రకారం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో ఎస్డీసీ ఆనంద్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ కనకరాజ్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.




