
D Spiritual: Nov 24: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
అమరావతి/హైదరాబాద్, నవంబర్ 24 (తెలుగు ప్రభ): కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదులు, పుష్కరిణుల్లో పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలను దర్శించుకున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. నదీ తీరాల్లో కార్తీక దీపాలను వెలిగించి, నీటిలో వదులుతూ మొక్కులు చెల్లించుకున్నారు. హరహర మహాదేవ, ఓం నమఃశివాయ నామస్మరణలతో పుణ్యక్షేత్రాలు మార్మోగాయి.
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని వశిష్ట గోదావరి తీరానికి కార్తీక పౌర్ణమి స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వలందర్ స్నానాల ఘాట్ భక్తులతో నిండిపోయింది. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు దీపాలను వదిలి మొక్కులు తీర్చుకున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
విజయవాడలోని కృష్ణానది తీరానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, మహాదేవుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. ఉదయం మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కార్తీక దామోదరుడికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రం కార్తీక పౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. ఆలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించనున్నారు. పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. మహానంది క్షేత్రంలోనూ కార్తీక కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాజగోపురం ఎదుట జ్వాలాతోరణం నిర్వహించిన అనంతరం కోటి దీపోత్సవం జరపనున్నారు. దీపాల వెలుగులతో మహానంది క్షేత్రం ప్రకాశించనుంది.
తెలంగాణలోనూ శివనామస్మరణ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించారు.
వరంగల్ ప్రాంతంలోని పలు శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గోదావరి తీరానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. రామాలయ అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పానగల్‌లోని ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మిర్యాలగూడలోని వాడపల్లి శైవక్షేత్రాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. సూర్యాపేటలోని పిల్లలమర్రి శివాలయం భక్తులతో నిండిపోయింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున దీపారాధనలు చేయడంతో ఆలయ ప్రాంగణాలు దీపకాంతులతో వెలిగిపోయాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంతో పాటు నందిపేటలోని కేదారేశ్వర ఆలయం, బోధన్‌లోని ఏకచక్రేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్ల కోనేరులో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా 108 కలశాలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలంపూర్‌లోని తుంగభద్ర నది తీరంతో పాటు బీచుపల్లి వద్ద కృష్ణానది తీరానికి భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం నదుల్లో కార్తీక దీపాలను వదిలారు. జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
మంచిర్యాల జిల్లాలోని ప్రసిద్ధ గుడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
దీపకాంతులతో పుణ్యక్షేత్రాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కళకళలాడాయి. నదీ స్నానాలు, అభిషేకాలు, దీపారాధనలు, కోటి దీపోత్సవాల సందడితో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల శివనామస్మరణలు, దీపాల వెలుగులతో ఆలయాలు, నదీ తీరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.




