
కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవడంతో వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ నెల 4వ తేదీన చేపల వేటకు రెండు బోట్లు సముద్రంలోకి వెళ్లాయని వాటిలో ఒకటి తిరిగి రాగా మరో బోటు ఆచూకీ లభించలేదని మంత్రి వివరించారు. పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర ప్రాంతంలో బోటు గల్లంతైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ ఘటనపై మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాకినాడ పారాదీప్ కోస్ట్‌గార్డ్, చెన్నై MRCC అధికారుల సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.
భారత నౌకాదళం కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావంతో బోటు ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మయన్మార్ దేశాల అధికారులకు కూడా సమాచారం అందించినట్లు వెల్లడించారు.
గల్లంతైన బోటులో 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు మత్స్యకారుల కుటుంబ సభ్యులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం ఉందని బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.




