ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. బుధవారం 14 జిల్లాల్లో వర్ష సూచన ఉండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపింది. ఈ మేరకు APSDMA మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

14 జిల్లాల్లో వర్ష సూచన

బుధవారం (నవంబర్ 25) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని అంచనా వేశారు.

పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు

మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4, నెల్లూరు జిల్లా కావలిలో 34.2, ప్రకాశం జిల్లా మారెళ్లలో 33.5, మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో 27.9, నెల్లూరులో 27.5, గుంటూరు జిల్లా ములుకుదురులో 26, నెల్లూరు రూరల్ ప్రాంతంలో 25.7 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రజలకు అధికారుల హెచ్చరిక

వర్షాల సమయంలో పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *