
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భావోద్వేగానికి గురయ్యారు. గౌతు కుటుంబం తొలిసారిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, అందుకు తనను క్షమించాలని కళింగ కోమట్లను కోరారు. మాట తప్పినందుకు బాధగా ఉందని, మొహం చెల్లకే ఇన్నాళ్లూ బయటకు రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పదవి విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. రాబోయే రోజుల్లో కళింగ కోమట్లకు తగిన గౌరవం ఇచ్చి, వారి రుణం తీర్చుకుంటానని గౌతు శిరీష హామీ ఇచ్చారు.
తొలిసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు తనను క్షమించాలని శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష భావోద్వేగానికి గురయ్యారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైస్ ఛైర్పర్సన్ పదవి విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయానని చెబుతూ వీడియో విడుదల చేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కళింగ కోమట్లను కోరారు.
గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి వజ్జా భవానిని ఛైర్పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేసిందని గౌతు శిరీష వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ కారణంగా వజ్జా భవానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినట్లు తెలిపారు.
అయితే ఎన్నికల సమయంలో పలాస మున్సిపాలిటీలో రెండో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కళింగ కోమట్లకు వైస్ ఛైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీకి అండగా నిలిచిన ఆ సామాజిక వర్గానికి పదవి కేటాయిస్తామని మాట ఇచ్చామని చెప్పారు. అప్పట్లో మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో పలాసలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మరీ ఈ హామీ ఇచ్చినట్లు గౌతు శిరీష వెల్లడించారు.
కళింగ కోమట్లు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి టీడీపీకి అండగా నిలిచారని గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 36 వార్డుల్లో 32 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పదవి విషయంలో హామీ ఇచ్చిన సమయంలో ఈ నిర్ణయం ఎమ్మెల్యేల పరిధిలోనే ఉంటుందని భావించామని చెప్పారు. అయితే చివరి నిమిషంలో వైస్ ఛైర్పర్సన్ అభ్యర్థులను రాష్ట్ర పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిసిందన్నారు.
కూటమి పొత్తులో భాగంగా వైస్ ఛైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తలుగా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని, వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి వచ్చిందని వివరించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను.. క్షమించండి
పలాస మున్సిపాలిటీలో టీడీపీ 28 వార్డులను గెలుచుకోగా.. కూటమి తరఫున మూడు వార్డుల్లో విజయం సాధించిన జనసేనకు వైస్ ఛైర్పర్సన్ పదవి కేటాయించాల్సి వచ్చిందని గౌతు శిరీష తెలిపారు. ఈ నిర్ణయం ఎవరూ తీసుకున్నా, పార్టీ అధిష్టానం ఆదేశించినా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన వ్యక్తిగా కళింగ కోమట్ల ముందు నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ.. గౌతు కుటుంబ చరిత్రలో కార్యకర్తలకు, గ్రామానికి, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను, చేసిన హామీలను ఇప్పటివరకు నిలబెట్టుకుంటూ వచ్చామని గుర్తుచేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తొలిసారిగా తాను ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయానని బాధ వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను మనస్ఫూర్తిగా క్షమించాలని, కళింగ కోమట్లకు శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని గౌతు శిరీష పేర్కొన్నారు
పలాస మున్సిపాలిటీలో కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క కళింగ కోమట్ల పెద్దలను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని గౌతు శిరీష తెలిపారు. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు వారి ముందుకు వెళ్లేందుకు మొహం చెల్లడం లేదని, అందుకే వీడియో ద్వారా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
భవిష్యత్తులో తనకు అవకాశం వచ్చినప్పుడు టీడీపీకి అండగా నిలిచిన కళింగ కోమట్లకు, ఆ సామాజిక వర్గ పెద్దలకు తప్పకుండా తగిన గౌరవం ఇచ్చి వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ గౌతు శిరీష వీడియో విడుదల చేశారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి వజ్జా గంగా భవాని విజయం సాధించారు. ఆమెకు మొత్తం 19,561 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి తలాసు శ్రీపద్మకు 10,716 ఓట్లు లభించాయి. దీంతో గంగా భవాని 8,845 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 32 స్థానాలను కైవసం చేసుకున్నారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పార్టీలు గెలిచిన వార్డులు
| పార్టీ | గెలిచిన వార్డులు |
|---|---|
| టీడీపీ | 27 |
| వైఎస్సార్సీపీ | 4 |
| జనసేన | 3 |
| బీజేపీ | 1 |
| స్వతంత్ర అభ్యర్థి | 1 |
| మొత్తం | 36 |




