
అమరావతి: కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
మత్స్యకారుల కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరుగురు మత్స్యకారుల గల్లంతు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఈ నెల 4వ తేదీన చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి వచ్చిందని, మరో బోటులో ఉన్న ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం ఆందోళనకరమని జగన్ అన్నారు.
గల్లంతైన మత్స్యకారులను క్షేమంగా వారి కుటుంబాల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.




