కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోస్ట్‌గార్డ్, భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లతో ఒడిశాలోని పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు చేపడుతున్నారు. మత్స్యకారులను గుర్తించి క్షేమంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11న ఉప్పాడ సముద్ర తీరం నుంచి సింహాద్రికి చెందిన బోటులో యజమానితో పాటు ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఒడిశాలోని పూరీ సమీపంలో పారాదీప్ తీర ప్రాంతంలో వేట సాగిస్తున్న సమయంలో ఈ నెల 13న కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.

తాము ఉన్న ప్రాంతంలో తుపాను ప్రభావం ఉందని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఏపీ ప్రభుత్వం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

తుపాను ప్రభావంతో బోటు ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల అధికారులకు కూడా సమాచారం అందించారు. బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరోవైపు, మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలతో పాటు చెన్నై ఎంఆర్‌సీసీ సమన్వయంతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు చేపడుతోందని భరోసా ఇచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *