అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని తీవ్రంగా విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, వారి కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు తీసుకురావడం, వేధింపులకు గురిచేయడం, అక్రమంగా నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రిగ్గింగ్ మ్యాన్‌గా మారారని విమర్శించారు.

ఎన్నికల నిర్వహణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారుల కూటమి కూడా తోడైందని రజిని ఆరోపించారు. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమాధానం చెప్పాలని విడదల రజిని డిమాండ్ చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *