వెబ్‌డెస్క్: 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. అయితే టాప్-12లోకి ప్రవేశించలేకపోయారు.

సానుభూతి కలిగిన నాయకులే ప్రపంచానికి అవసరం

ఫైనల్ రౌండ్‌లో ప్రపంచానికి ఎలాంటి నాయకులు అవసరమనే ప్రశ్నకు జెన్నిఫర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు ఇతరుల పట్ల సానుభూతి చూపగల నాయకులు ప్రపంచానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతరులను విమర్శించే బదులు వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలని, తమ విలువలకు కట్టుబడి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆమె సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.

చదువులోనూ.. సేవా కార్యక్రమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు

జెన్నిఫర్ బారెటో అందాల పోటీల్లోనే కాకుండా విద్య, సామాజిక సేవా రంగాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆర్మీ విభాగంలో ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, హానికరమైన అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చిన్నారుల డయాబెటిస్ అసోసియేషన్‌తో కలిసి మధుమేహంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పుస్తక పఠనం, వాలీబాల్ ఆడటం ఆమెకు ఇష్టమైన అభిరుచులు.

ఇలా అందం, విద్య, సామాజిక సేవలను సమన్వయం చేసుకుంటూ జెన్నిఫర్ బారెటో 75వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *