విజయవాడ: మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను దక్షిణాది ప్రజలు సహించబోరని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, విద్వేష రాజకీయాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం కాదని అన్నారు.

బీజేపీ రాజకీయంగా తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఉగ్రవాద బెదిరింపులు, మత ఘర్షణలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దక్షిణ భారత ప్రజల రాజకీయ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయడం బీజేపీకి పొరపాటేనని పేర్కొన్నారు.

గతంలో చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనలకు సంబంధించి ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవని భార్గవ్ అన్నారు. ఆయా ఘటనలపై పూర్తి పారదర్శకతతో, బాధ్యతాయుతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఏ పార్టీకి తగదని హితవు పలికారు.

అలాగే ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై ఎన్నికల సంఘం జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘంలో ప్రక్షాళన జరగాలని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *