
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వరకు బయటకు రాకుండా ఉండి ఇప్పుడు బఫూన్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం గుడివాడ ప్రజావేదికలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు కొడాలి నాని గురించి పట్టించుకునే సమయం లేదని గుడివాడ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లుగా మౌనంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో కొడాలి నాని రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాము విమర్శించారు. తాను స్కాములకు పాల్పడ్డానంటూ నాని ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి గురించి మాట్లాడే ముందు కొడాలి నాని తన గతాన్ని గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
స్కాములు చేయడంలో నానికి మించిన వారు ఎవరూ లేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు కొడాలి నానికి పరిచయం ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్ కుమారుడి పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. భారీగా బకాయి నోటీసులు రావడంతో మానసిక వేదనకు గురై ఆయన మరణించారని పేర్కొన్నారు.
అలాగే సెంటు భూముల మెరక పనుల పేరుతో అమాయకుల పేర్లపై ఖాతాలు తెరిచి భారీ మొత్తంలో పనులు చేసినట్లు చూపించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జీఎస్టీ నోటీసులు వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం నియోజకవర్గ ప్రజలకు తెలిసిందని అన్నారు. కొడాలి నాని వ్యవహారాలన్నీ బయటపడితే ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
తనపై ఇలాంటి ఆరోపణలు మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొడాలి నానిని రాము హెచ్చరించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా బొమ్ములూరులో కూటమి జెండాను తొక్కిన ఘటనపైనా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పందించారు.
జాతీయ జెండా తర్వాత పార్టీ జెండాకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని దానిని అవమానిస్తే సహించేది లేదని అన్నారు. జెండాను తొక్కిన వ్యక్తులు లేదా వారిని ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి భర్త ఈ ఘటనపై వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




