
శ్రీ సత్యసాయి బ్యూరో, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో బీజేపీ జాతీయ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గోవాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతం, నూతన కమిటీల ఏర్పాటు, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు.
బీజేపీ వివిధ విభాగాలకు నూతన కమిటీల ఏర్పాటు, బాధ్యతల కేటాయింపు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణపై అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపైనా చర్చించారు.
ఈ సందర్భంగా గోవాలోని వివిధ ప్రాంతాలకు వలస వచ్చే పక్షుల విశేషాలు, వాటి చరిత్రను చిత్రాలతో వివరించిన పుస్తకాన్ని సీఎం ప్రమోద్ సావంత్.. విష్ణువర్ధన్ రెడ్డికి బహూకరించారు. తనకు అందించిన ఈ ఆత్మీయ బహుమతికి ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో గోవా బీజేపీ విభాగాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, రానున్న ఎన్నికలకు సమష్టి కార్యాచరణతో ముందుకు సాగడమే సమావేశం ప్రధాన ఉద్దేశమని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.




