
హైదరాబాద్ నగరవాసులకు మరో శుభవార్త. నగరంలో మరో చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. సున్నం చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును 32 ఎకరాలకు విస్తరించింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యాన్ని 47.58 మిలియన్ లీటర్ల నుంచి 200 మిలియన్ లీటర్లకు పెంచింది.
చెరువు పరిసరాలను ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 1.35 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్‌తో పాటు పార్కులు, ఓపెన్ జిమ్, వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్, వ్యాయామం చేసుకునే అవకాశం కలగనుంది.
ఈ అభివృద్ధి పనులు పూర్తికావడంతో సున్నం చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఆక్రమణలు, కాలుష్యం కారణంగా కుంచించుకుపోయి మురికికూపంగా మారిన హైదరాబాద్‌లోని సున్నం చెరువుకు హైడ్రా కొత్త రూపు తీసుకొచ్చింది. ఆధునిక సదుపాయాలతో చెరువును అభివృద్ధి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. డిసెంబర్ 2, 3 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెరువును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం రాత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, పాత్వే, బండ్‌తో పాటు ప్రవేశ ద్వారాలను తనిఖీ చేశారు. పెద్ద బండరాయిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. అలాగే పార్కులు, చిన్నారుల ఆటస్థలాలు, ఓపెన్ జిమ్ సదుపాయాలను సందర్శించి పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఒకప్పుడు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కారణంగా సున్నం చెరువు తన అసలు విస్తీర్ణాన్ని కోల్పోయి కేవలం 14 ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో వర్షాకాలంలో సమీప కాలనీలను వరద ముప్పు వెంటాడేది. ఈ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో హైడ్రా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను తొలగించి పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో స్థానికుల నుంచి నిరసనలు, ఆందోళనలు ఎదురైనా అధికారులు పనులను కొనసాగించారు.
హైడ్రా చర్యల ఫలితంగా సున్నం చెరువు విస్తీర్ణం 14 ఎకరాల నుంచి 32 ఎకరాలకు పెరిగింది. నీరు నిల్వ ఉండే ప్రాంతం కూడా 9 ఎకరాల నుంచి 16 ఎకరాలకు పైగా విస్తరించింది. గతంలో చెరువు నీటి నిల్వ సామర్థ్యం 47.58 మిలియన్ లీటర్లు మాత్రమే ఉండగా.. పునరుద్ధరణ తర్వాత 200 మిలియన్ లీటర్లకు చేరుకుంది.
వరద ముప్పునకు చెక్.. భూగర్భ జలాలకూ మేలు
సున్నం చెరువు పునరుద్ధరణలో భాగంగా ఇన్లెట్లు, ఔట్లెట్లను ఆధునికీకరించి అభివృద్ధి చేశారు. దీంతో వర్షపు నీరు సులభంగా చెరువులోకి చేరడంతో పాటు అదనపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం ఏర్పడింది. ఈ పనులతో గుట్టలబేగంపేట, నవభారత్‌నగర్ తదితర ప్రాంతాలకు వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు తగ్గే అవకాశం ఉంది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాల రీఛార్జికి కూడా ప్రయోజనం కలగనుంది.
మరోవైపు చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెరువు చుట్టూ 1.35 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ నిర్మించింది. వ్యాయామం కోసం ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ఆటస్థలాలు ఏర్పాటు చేసింది. సందర్శకులు సేదతీరేందుకు పార్కులను అభివృద్ధి చేసింది. చెరువు పక్కనే ఉన్న భారీ బండరాయిపై ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ అభివృద్ధి పనులతో స్థానికులకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది.
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి గొలుసుకట్టు చెరువులు ప్రత్యేక గుర్తింపుగా ఉండేవి. అయితే వేగంగా పెరిగిన పట్టణీకరణ, ఆక్రమణలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా అనేక చెరువులు కనుమరుగయ్యాయి. మరికొన్ని క్రమంగా కుంచించుకుపోయి నిరుపయోగంగా మారాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు హైడ్రా చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలిదశలో తుమ్మిడికుంట, సున్నం చెరువులతో పాటు నల్లచెరువు, బతుకమ్మకుంట వంటి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టింది. చెరువులను కేవలం సుందరీకరించడమే కాకుండా వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు, వరద ముప్పు నివారణకు ఉపయోగపడే సహజ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపట్టింది.
ఇటీవలే మాదాపూర్ హైటెక్‌సిటీ ప్రాంతంలోని తుమ్మిడికుంట చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసి ఈ చెరువును ప్రారంభించారు. గతంలో ఆక్రమణలు, వ్యర్థాల పేరుకుపోవడంతో సుమారు 14 ఎకరాలకు పరిమితమైన ఈ చెరువును దాదాపు 30 ఎకరాలకు విస్తరించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాల తొలగింపు కూడా ఈ పునరుద్ధరణలో కీలక పరిణామంగా నిలిచింది. చెరువు విస్తరణ కోసం నాగార్జున రెండు ఎకరాల భూమిని అందించారు.
పునరుద్ధరణ పనుల్లో భాగంగా చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. స్థానికులు ఆహ్లాదంగా గడిపేందుకు వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆటస్థలం ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంచేందుకు గ్రీనరీని అభివృద్ధి చేశారు. దీంతో తుమ్మిడికుంట చెరువు పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా కొత్త రూపు సంతరించుకుంది.




