భారత్ ఫ్యూచర్‌సిటీకి అనుసంధానంగా తుక్కుగూడలోని ఫ్యాబ్‌సిటీని ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సెజ్ హోదా నుంచి డీ-నోటిఫై అయిన 922 ఎకరాల భూమిలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించడంతో పాటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌ వెస్ట్ ప్రాంతం తరహాలోనే నగర దక్షిణ భాగంలోనూ ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్‌సిటీకి అనుసంధానంగా తుక్కుగూడలోని ఫ్యాబ్‌సిటీని ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ దిశగా రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

ఫ్యాబ్‌సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలో ఉన్న 922 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం డీ-నోటిఫై చేయడంతో వాటిని ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడ ఐటీ సంస్థలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇతర పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి అనువుగా ఉంటుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికలు సమర్పించారు.

ఫ్యాబ్‌సిటీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్‌ఖాన్‌పేట ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలను పారిశ్రామికంగా అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాబ్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ మధ్య ఉన్న ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాబాద్ మండలాల్లో పలు బహుళజాతి కంపెనీలు, సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పారిశ్రామిక అభివృద్ధిని మరింత విస్తరించి తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీని కీలక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఫ్యాబ్‌సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ఏర్పాటైతే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల నిపుణులకు కూడా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పరిశ్రమల రాకతో ఐటీ, తయారీ రంగాలకే కాకుండా రవాణా, గిడ్డంగులు, నిర్వహణ, ఇతర అనుబంధ సేవారంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తద్వారా హైదరాబాద్ దక్షిణ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఫ్యాబ్‌సిటీ, ఫ్యూచర్‌సిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి, శంషాబాద్‌-గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లు ప్రధాన అనుసంధాన మార్గాలుగా ఉన్నాయి.

వీటికి అదనంగా ఫ్యూచర్‌సిటీని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌తో అనుసంధానిస్తూ రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 పేరుతో 300 అడుగుల వెడల్పైన రహదారిని నిర్మిస్తున్నారు. అలాగే శంషాబాద్ నుంచి తుక్కుగూడ మీదుగా కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు మరో రహదారిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే ఫ్యాబ్‌సిటీ, ఫ్యూచర్‌సిటీల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు మరింత అనుకూలత ఏర్పడనుంది.

శరవేగంగా ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి పనులు

మరోవైపు భారత్ ఫ్యూచర్‌సిటీలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం ప్రారంభం కావడంతో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతోంది. మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రేడియల్ రోడ్ల అనుసంధాన పనులు కూడా వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగ్గా.. టీసీఎస్ హైపర్‌వాల్ట్ ఏఐ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు ఫ్యూచర్‌సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనతో పాటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా వివిధ దశల్లో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక రంగాలకు కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *