స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) కీలక మార్పులు ప్రకటించింది. కేవైసీ (KYC) ప్రక్రియలో పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు, మార్కెట్ మధ్యవర్తుల మధ్య ఖాతాదారుల సమాచార మార్పిడిని మెరుగుపరిచేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులతో మదుపర్లకు సమయం ఆదా కావడంతో పాటు ఖాతాల నిర్వహణ కూడా సులభతరం కానుంది.

ఒకసారి వివరాలు ఇస్తే సరిపోతుంది

కొత్త నిబంధనల ప్రకారం బ్రోకరేజ్ సంస్థలు సహా వివిధ మార్కెట్ మధ్యవర్తులకు ఉమ్మడిగా అవసరమైన ఖాతాదారుల అనుబంధ సమాచారాన్ని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (KRA) వద్ద భద్రపరుస్తారు. దీంతో మదుపర్లు కొత్తగా మరో బ్రోకర్ లేదా ఇతర మధ్యవర్తి వద్ద ఖాతా తెరిచేటప్పుడు ఒకే వివరాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఖాతా ప్రారంభ దరఖాస్తులోని రెండో భాగంలో ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు తదితర సంస్థలను మార్కెట్ ఇంటర్మీడియరీలుగా పరిగణిస్తారు.

కేవైసీ రికార్డుల అప్‌డేట్‌పై కొత్త మార్గదర్శకాలు

సెంట్రల్ కేవైసీ ఐడెంటిఫైయర్, డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్, అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాల గడువు వంటి అదనపు వివరాలను కూడా సంబంధిత వ్యవస్థలో నమోదు చేయాలి. కేఆర్ఏ, సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCRR) నుంచి సమాచారం అప్‌డేట్ అయిన వెంటనే ఖాతాదారుల రికార్డులను సవరించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్లకు మినహా ఇతర మధ్యవర్తుల వద్ద ఖాతా మూసివేసిన వివరాలను ఐదు పనిదినాల్లోగా తెలియజేయాలి. ఈ సమాచారం అందిన రెండు పనిదినాల్లోగా కేఆర్ఏ సంబంధిత రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలకూ ప్రత్యేక నిబంధనలు

మ్యూచువల్ ఫండ్ ఫోలియోల్లో వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేకపోవడం, పెట్టుబడులు కూడా లేకపోవడంతో బ్యాలెన్స్ సున్నాగా ఉంటే సంబంధిత ఫండ్ హౌస్ లేదా రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (RTA) ఐదు పనిదినాల్లోగా కేఆర్ఏకు సమాచారం అందించాలి. ఈ వివరాలు అందిన తర్వాత సంబంధిత ఫోలియోకు సంబంధించిన అప్‌డేట్లను మ్యూచువల్ ఫండ్ లేదా ఆర్టీఏతో పంచుకోవడాన్ని కేఆర్ఏ నిలిపివేస్తుంది.

అలాగే ఏదైనా మార్కెట్ మధ్యవర్తి నుంచి ఖాతాదారుడి రికార్డును డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ, 21 పనిదినాల్లోగా ఖాతా ప్రారంభించకపోతే ఆ రికార్డును తొలగించేందుకు తదుపరి ఐదు పనిదినాల్లోగా సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల పరిశీలనకు ఏఐ సాంకేతికత

మరోవైపు, దరఖాస్తులను నియంత్రిత వాతావరణంలో పరిశీలించేందుకు కృత్రిమ మేధ (AI) శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని సెబీ పరిశీలిస్తోంది. సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ సాధనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. సెక్యూరిటీస్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దేశీయంగా నిర్వహించే ప్రత్యేక ఏఐ నమూనాను అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *