
ఏపీలో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130 రైతు బజార్లలో స్టాల్స్ ద్వారా బియ్యం తక్కువ ధరకే విక్రయిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సూపర్ ఫైన్ స్టీమ్ రైస్‌ను రూ. 52కు, బీపీటీ గ్రేడ్-1ను రూ. 50కు, గ్రేడ్-2ను రూ. 48కు విక్రయిస్తామన్నారు.
ఏపీలో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. ఎల్‌నినో సహా ఇతర కారణాలతో రేట్లను భారీగా పెంచేశారు. ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లుల దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నారు. మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలు, రవాణా ఖర్చుల కారనంగా బియ్యం, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని మంత్రి మనోహర్ అన్నారు. మంత్రి అమరావతిలోని సచివాలయంలో రైస్‌మిల్లర్లతో సమావేశమై బియ్యం ధరలపై చర్చించారు.. అనంతరం బియ్యం ధరల్ని ప్రకటించారు. బీపీటీ, కేఎన్‌ఎం స్టీమ్ బియ్యం కిలో రూ.52, ముడి బియ్యాన్ని కిలో రూ.50 లెక్కన విక్రయిస్తారు. గ్రేడ్-2 బియ్య కిలో రూ.42కు అమ్ముతారు. రైతు బజార్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తామని రైస్ మిల్లర్లు హామీ ఇచ్చారు.
ఎల్‌నినో పేరు చెప్పి బియ్యం, నిత్యావసరాల ధరలను పెంచేశారనే టాక్ వినిపిస్తోంది. బియ్యం ధర కిలో రూ.4-5 చొప్పున పెరిగింది.. అదే క్వింటాకు రూ.400-500 పెంచారు. 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,550కు పెరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం బియ్యం ధరల విషయంలో అలర్ట్ అయ్యింది.. మధ్యవర్తుల పాత్ర తగ్గించాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో విక్రయించనున్నారు. అప్పుడు ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యులపై బియ్యం ధరల భారం తగ్గించి, మార్కెట్‌లో ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు ఊరట దక్కతుందని భావిస్తున్నారు.
మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోనళలో ఉన్నారు. గత మూడు నెలలతో పోలిస్తే 20-25 శాతం వరకు బియ్యం ధరలు పెరిగిపోయాయి. ఎల్‌నినో ప్రభావం, తగినంత లభ్యత లేదని మిల్లర్లు చెబుతున్నారని వ్యాపారులు అంటున్నారు. కొన్ని చోట్ల పాత ధరలకే బియ్యం విక్రయిస్తున్నా.. కొందరు మాత్రం ధరలు పెంచేశారని చెబుతున్నారు. కొంతమంది బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించి పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది.. ఆగస్టు 1 నుంచి బియ్యాన్ని రైతు బజార్లు, కౌంటర్లలో తక్కువ ధరకు విక్రయించనున్నారు.

