
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో 22 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గోల్డెన్ ఛాన్స్‌పై ఏపీఎండీసీ ఫోకస్ పెట్టింది.. ఈ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీఎండీసీ ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది.. అలాగే వేలం లేకుండా ఏపీకి రిజర్వ్ చేసేలా కేంద్రాన్ని కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బంగారు గనుల్ని దక్కించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో ‘గోల్డెన్’ ఛాన్స్ దక్కింది.. మరో జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతనిధ్యం వహిస్తున్న చిత్తూరులో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట-బి.సానత్తం బంగారు గనులపై ఫోకస్ పెట్టింది. ఈ బంగారు నిక్షేపాలను దక్కించుకునేందుకు నిర్వహించే ఈ-వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. అదే సమయంలో వేలం లేకుండా ఈ గనుల్ని ఏపీఎండీసీకి కేటాయించేలా చూడాలని కేంద్రాన్ని కోరే దిశగా అడుగులు వేస్తోంది. ఈ బంగారు గనుల్ని దక్కించుకుంటే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.. అలాగే జవకుల, రామగిరి, బొక్సంపల్లిపై కూడా ఫోకస్ పెట్టారు.
చిగురుగుంట-బి.సానత్తంలోని బంగారు గనుల్లో ఏకంగా 22 లక్షల టన్నుల ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 5.64 గ్రాముల వరకు బంగారం సేకరించొచ్చని చెబుతున్నారు. మొత్తం ఖనిజాన్ని వెలికి తీస్తే12,500 కిలోల బంగారం వస్తుందని చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఖనిజాన్ని బయటకు తీసి కొంత శుద్ధి చేసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గరకు తరలించేవారు. అక్కడ ఖనిజాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేసి బంగారాన్ని సేకరించేవారు. ఆ సమయంలో ఖనిజాన్ని బయటకు తీసి కర్ణాటకకు తరలించడానికి ఖర్చు పెరగడంతో తవ్వకాలు ఆపేశారు. బంగారం ధరలు తక్కువగా ఉండటంతో ఈ 2000 సంవత్సరంలో గనుల్ని మూసివేశారు. 2018లో మరోసారి ఈ వేలం నిర్వహించగా ఎన్‌ఎండీసీ ఈ గనుల్ని దక్కించుకుంది. ఆ తర్వాత కోర్టు కేసుల కారణంగా అడుగులు ముందుకుపడలేదు.. 2022లో ఎన్‌ఎండీసీ, గనులశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చినా సరే.. ఎన్ఎండీసీ వెనక్కు తగ్గింది.

