
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి (36) తన నివాస క్వార్టర్స్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది.
బుధవారం ఉదయం నుంచి సహోద్యోగులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే చాలా సేపటి వరకు క్వార్టర్స్ తలుపులు కూడా తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు హిజ్లీ ఔట్‌పోస్ట్ పోలీసులు భద్రతా సిబ్బంది సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా, దీపక్ రెడ్డి ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. అనంతరం వెంటనే ఆయనను క్యాంపస్‌లోని బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గదిని సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్టుమార్టం నివేదిక అనంతరమే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా తెలిపారు.
ఇది ఆత్మహత్యా? లేక ఉద్యోగ, వ్యక్తిగత లేదా ఇతర కారణాల వల్ల జరిగిన విషాదమా? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఈ ఘటనపై ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

