
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రానున్న మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఏపీఎస్డీఎంఏ.. ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
అదే సమయంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. అలాగే అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరింది.

