
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి వరకు 161.518 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను రూ.23,935 కోట్ల మూలధన వ్యయంతో చేపట్టనున్నారు. ఈ నెల 7న టెండర్ల సాంకేతిక బిడ్లను తెరవాల్సి ఉండటంతో కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనుమతి త్వరలోనే రానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కావాల్సిన దాదాపు అన్ని రకాల పర్యావరణ, సాంకేతిక అనుమతులను పూర్తి చేసింది. సీసీఈఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే మిగిలింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అవసరమైనపూర్తిస్థాయి కేంద్ర అనుమతులను సాధించి, క్షేత్రస్థాయి పనులను కూడా వేగవంతంగా ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ తమ తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఎన్హెచ్ఏఐ సమర్పించిన ప్రణాళిక ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల పొడవునా ఈ గ్రీన్ఫీల్డ్ రీజినల్ ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తారు. ఈ రహదారిని అత్యంత ఆధునిక సదుపాయాలతో 6 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక రహదారి ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం రూ. 23,935 కోట్లుగా అంచనా. ఇందులో సివిల్ నిర్మాణ పనుల నిమిత్తం రూ. 9,362 కోట్లను కేటాయించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను హ్యామ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఉత్తర భాగం పనులను వేగవంతం చేసేందుకు గాను దీనిని రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1 కింద గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, ప్యాకేజీ-2 కింద ప్రజ్ఞాపూర్ నుంచి తంగడ్పల్లి వరకు పనులను చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఈ ఏడాది మే 20న టెండర్లను ఆహ్వానించింది.

