
Hyderabad: హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల వ్యవహారం సంచలనంగా మారింది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా ఉపయోగించి ఫేక్ ఫైర్ ఎన్వోసీలు (NOC) సృష్టించిన 8 ప్రైవేట్ ఇంటర్ కళాశాలలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఫైర్ ఎన్వోసీలు జారీ చేసే బాధ్యత హైడ్రా సంస్థదే. అయితే, హైడ్రా నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు జారీ కాకపోయినా, ఆయా కళాశాలల యాజమాన్యాలు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలను రూపొందించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నకిలీ ధ్రువపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించి కళాశాలల అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఇంటర్ బోర్డుకు వివిధ కళాశాలల నుంచి అందిన మొత్తం 76 ఫైర్ ఎన్వోసీలను హైడ్రా అధికారులు పరిశీలించగా, వాటిలో 8 కళాశాలలు సమర్పించిన పత్రాలు పూర్తిగా నకిలీవని నిర్ధారించారు.
ఈ ఘటనపై హైడ్రా అదనపు డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంబంధిత 8 ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ విద్యా మండలికి కూడా లేఖ పంపినట్లు సమాచారం.

