
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు వైఎస్ షర్మిల. మేనిఫెస్టోకు మంగళంపాడేసి.. అన్ని హామీలు అమలు చేశారని గొప్పలు చెప్పడం దారుణమన్నారు. సూపర్ సిక్స్ హామీలకు పంగనామం పెట్టి.. రెండేళ్ల పాలన మోసాలమయంగా మారిందని విమర్శించారు.టీడీపీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశాయన్నారు. అభివృద్ధి బూటకం, రాష్ట్రంలో సంపద సృష్టి మోసమంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కూటమి పాలన 24 మోసాలమయమన్నారు వైఎస్ షర్మిల. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యాయని.. ఎన్నికల హామీలకు పంగనామాలు పెట్టారని సెటైర్లు పేల్చారు. మ్యానిఫెస్టోకి మంగళం పాడారని.. అమలు చేశామని చెప్పే పథకాలు అరకొరగానే ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాబు షూరిటీ – భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు.
భరోసా పేరు చెప్పి సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారని విమర్శించారు షర్మిల.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేని పక్షంలో 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు రూ.1500 ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారని ధ్వజమెత్తారు. దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేశారని.. గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారన్నారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చి.. 20 వేలు ఇస్తామని PM కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారన్నారు.
ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని రూ.15 వేలు అని హామీ ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారన్నారు షర్మిల. ఇస్తున్న వారికి రూ.2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారన్నారు. ఆరోగ్యశ్రీకి 4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లిందన్నారు. ’32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు ?. 12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు ? 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు ? తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా టీడీపీ, వైఎస్సార్‌సీపీలు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి 2 లక్షలు. 2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

