
ఆధునిక కాలంలో జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రైయర్లు ఎంత పాపులర్ అయినా సరే మన అమ్మమ్మలు, నానమ్మలు అందించిన సాంబ్రాణి ధూపం ఇచ్చే ఆరోగ్యం, ఆ ప్రశాంతత వేరు. తలస్నానం చేసిన తర్వాత కుదుళ్లలో పేరుకుపోయే తేమను తొలగించి జలుబు, తలనొప్పి వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో ఇది అద్భుతమైన ఆయుర్వేద చిట్కా. కేవలం జుట్టుకు పట్టులాంటి మెరుపును, ఆహ్లాదకరమైన సువాసనను ఇవ్వడమే కాకుండా తలమాడుపై హానికర బ్యాక్టీరియా చేరకుండా ఇది కాపాడుతుంది. సంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని ఒకేసారి అందించే ఈ ప్రాచీన పద్ధతి ఈనాటి మోడ్రన్ లైఫ్‌స్టైల్‌కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు తలస్నానం చేసిన వెంటనే తడి జట్టుకు సాంబ్రాణి పట్టే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు ఈ పని తప్పకుండా చేసే వారు. అయితే ఈ సంప్రదాయ పద్ధతి వెనుక కేవలం మంచి సుమాసన మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. జట్టు త్వరగా ఆరడమే కాకుండా తలమాడుపై ఫంగస్ ఇన్ఫెక్షన్లు రాకుండా, జలుబు, సైనసైటిస్ లాంటి సమస్యలు దరిచేరకుండా ఇది కాపాడుతుంది.
అయితే ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల రసాయన ధూపాలు లభిస్తుండటంతో సహజ సిద్ధమైన సాంబ్రాణి ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే సాంబ్రాణి ధూపం వేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడంతో పాటు మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యానికి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
తలస్నానం చేసిన తర్వాత జుట్టులో తడి ఉండటం వల్ల కొందరికి జలుబు, శ్లేష్మం పట్టడం లేదా సైకస్, తలనొప్పి వస్తుంది. సాంబ్రాణి పొగలోని వేడి తలలోని తేమను తగ్గించి జలుబు రాకుండా కాపాడుతుంది. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు చిన్న పిల్లలు స్నానం చేసిన వెంటనే సాంబ్రాణి పొగ పట్టేవారు.

