
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్తో కలిసి నూతనంగా నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని, తుది దశలో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు.
ఈ తనిఖీల్లో స్థానిక ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సుమారు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి చంచల్‌గూడ జైలు ప్రాంతాన్ని ఓవైసీ ఆస్పత్రి, అలాగే చంపాపేట ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, చంపాపేట తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయని అధికారులు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
అలాగే మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే నగర దక్షిణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉంది.
నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టిన ఫ్లైఓవర్, బ్రిడ్జి పనులతో పాటు ఇతర పెండింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

