
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో చిరంజీవి ప్రజాదరణను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పలు కథనాలు వెలువడ్డాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు చిరంజీవిని ఎంపిక చేయనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.
అయితే, ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి పీఆర్ బృందం స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదని వెల్లడించింది. ఆధారాలు లేని వార్తలు, ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడినట్లైంది.

